Telugu News » Harish Rao : సభలో హరీశ్‌ రావు మట్లాడుతుండగా…సీతక్క ఎంట్రీ, అప్పుడూ…

Harish Rao : సభలో హరీశ్‌ రావు మట్లాడుతుండగా…సీతక్క ఎంట్రీ, అప్పుడూ…

. ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఉండకుండా ప్రతి జిల్లాలో వైద్యం అందేలా ప్రయత్నిస్తున్నామని హరీశ్ ​రావు మాట్లాడుతుండగా...కాంగ్రెస్ ఎమ్మేల్యే సీతక్క వచ్చారు.

by Prasanna

తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ములుగు జిల్లాలో రూ. 183 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బండారుపల్లి  బహిరంగ సభలో హరీశ్‌ రావు మాట్లాడుతుండగా…కాంగ్రెస్ ఎమ్మేల్యే సీతక్క ఎంట్రీ ఇచ్చారు. అప్పుడేం జరిగిందంటే…

గత ప్రభుత్వాల హయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, కేసీఆర్ వచ్చాకే ప్రజలు సురక్షితంగా ఉన్నారనీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతోనే కేసీఆర్‌ ప్రతి జిల్లాలో ఆసుపత్రులు నిర్మిస్తున్నారని తెలిపారు. తెలంగాణాలో వైద్య విప్లవాన్ని సృష్టించింది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.

కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా, మెడికల్ కాలేజ్ వచ్చేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మీ పధకం అమలుకు స్ఫూర్తి ములుగు జిల్లాయేనని గుర్తు చేశారు. ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీస్ బతికి ఉంటే మెడికల్ కాలేజ్ రావడాన్ని చూసి సంతోషపడేవారని చెప్పారు. ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ రావాల్సిన అవసరం ఉండకుండా ప్రతి జిల్లాలో వైద్యం అందేలా ప్రయత్నిస్తున్నామని హరీశ్ రావు మాట్లాడుతుండగా…కాంగ్రెస్ ఎమ్మేల్యే సీతక్క వచ్చారు.

సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ నేతలు పెద్దగా కనిపించరు. కానీ ములుగు జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వేదికపైకి వచ్చారు. మంత్రులు హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత పాల్గొన్న ఈ సభలో సీతక్క ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందోనని కొందరు కంగారు పడ్డారు.

సభలో సీతక్కని మాట్లాడవలసిందిగా హరీశ్‌ రావు కోరడంతో ఆమె మాట్లాడారు. తాను ఈ సభకు గొడవ పడేందుకు రాలేదని, తమ ప్రాంత సమస్యలను ప్రస్తావించేందుకే వచ్చానని సీతక్క చెప్పారు. ఆలస్యంగా అయినా తమ ప్రాంతానికి మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు సంతోషం అన్నారు. తమ ప్రాంతానికి గోదావరి జలాలు రాలేదని, ఆ విషయంలో మంత్రులు చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ శాసన సభ్యుల మాట చెల్లుబాటు అవుతుందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఆ అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కోరారు.

అంతకు ముందు సభ వద్దకు ఎమ్మెల్యే సీతక్క రావడాన్ని చూసిన మంత్రి హరీశ్‌ రావు ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించారు. అనంతరం ఆమెకు మాట్లాడేందుకు అవకాశం కూడా ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి కూడా మాట్లాడేందుకు అవకాశమిచ్చి హుందాగా వ్యవహరించారు హరీశ్‌ రావు. ఎమ్మెల్యే సీతక్క కూడా ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా, సున్నితంగా సమస్యలను ప్రస్తావించారు. మొత్తానికి సీతక్క ఎంట్రీతో సభలో ఏమవుతుందా అని అనుకున్నప్పటికీ…సభ మొత్తం ప్రశాంతంగానే ముగిసింది.

You may also like

Leave a Comment