ఏపీ సీఎం జగన్ (CM Jagan) ను కలిశారు పారిశ్రామక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani). గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ (Vijayawada) ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం ఇంటికి వెళ్లారు. క్యాంపు కార్యాలయంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జగన్, అదానీ భేటీ కొనసాగింది.
ఈ సమావేశంపై ట్విట్టర్ (ఎక్స్) లో అదానీ స్పందించారు. ఏపీలో తన సంస్థ వెంచర్లపై చర్చించానని అన్నారు. అలాగే, గంగవరం పోర్టు, విశాఖ డేటా సెంటర్ ఏర్పాటు అంశాలపై మాట్లాడుకున్నామని చెప్పారు. ఈ ఏడాది మార్చిలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల కోసం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది. ఆ సమయంలో అదానీ కార్యక్రమానికి రాలేదు. ఆయన కుమారుడు కరణ్ అదానీ వచ్చారు.
ఏపీలో అదానీ గ్రూప్ రెండు కొత్త సిమెంట్ యూనిట్లు, వైజాగ్ డేటా సెంటర్, గంగవరం పోర్టు, రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పుడు రాలేకపోయిన గౌతమ్ అదానీ తాజాగా సీఎంను నేరుగా కలిసి ప్రాజెక్టుల అమలు ప్రణాళికలపై చర్చించారు.
జగన్, అదానీ భేటీపై ఫుల్ క్లారిటీ కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. అది వ్యక్తిగత భేటీనా? లేక వ్యవస్థీకృత భేటీనా? అని ప్రశ్నించారు. గతంలో కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో జగన్ ను ఆదానీ కలిసి 4 గంటల పాటు భేటీ అయ్యారని గుర్తుచేశారు. ఏపీలో ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీకి అప్పగించారని.. సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని.. అత్యంత ఎక్కువ ధరకు ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు కూడా కట్టబెట్టారని విమర్శించారు. జగన్, అదానీల భేటీ వెనుక అసలు నిజాలు బయటకు రావాలన్నారు రామకృష్ణ.