సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నుపై (Gru Patwanth Singh Pannu_ అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ (World Cup) కు సంబంధించి బెదిరింపులతో కూడిన రికార్డింగ్ కాల్ (Recording Call) ఒకటి విదేశీ నంబర్ నుంచి అహ్మదాబాద్ లోని పలువురికి వచ్చింది.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు స్పందనగా ఈ బెదిరింపులు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ కాల్స్ +44 నంబర్ కోడ్ గల నంబర్ నుంచి వచ్చినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. +44 నంబర్ అనేది బ్రిటన్ కు చెందినదిగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
వచ్చే నెల 5న అహ్మదాబాద్ లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎస్ఎఫ్ జే వ్యవస్థాపకుడు గురు పత్వంత్ సింగ్ వాయిస్ తో వున్న రికార్డింగ్ కాల్ పలువురికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC), చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కుట్ర, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద పన్నుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఖలిస్తాన్ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రెలో ఇటీవల హత్యకు గురయ్యారు. నిజ్జర్ హత్య వెనుక భాతర హస్తం ఉన్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అప్పటి నుంచి భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి.