2వేల రూపాయల నోట్ల (Two thousan Rupees Notes) ను మార్చుకునేందుకు తుది గడువును (Last Date) ఆర్బీఐ (RBI) పొడిగించింది. ఈ నెల 7 వరకు ప్రజలు బ్యాంకు (Banks) ల్లో 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందు రూ. 2 వేల రూపాయల నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30ని చివరి తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.
ఆర్బీఐ ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో తాజాగా గడువును మరోసారి పెంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నెల 7లోగా ప్రజలు 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల వద్ద మార్పుకోవాలని సూచించింది. ఈ నెల 8 నుంచి బ్యాంకులు రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోబోవని పేర్కొంది. అయినప్పటికీ రూ. 2 వేల రూపాయలు చట్టబద్ధంగా చలామణి అవుతాయని వివరించింది.
ఈ నెల 8 తర్వాత ప్రజలు ఆర్బీఐకి చెందిన 19 కార్యాలయాల్లో ఈ నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. ఒక కస్టమర్ గరిష్టంగా రూ. 20 వేలు విలువ చేసే రూ. 2 వేల నోట్లను మార్చు కోవచ్చని ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ ద్వారా మార్చుకున్న ఈ నోట్లను కస్టమర్ల బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ చేస్తామని స్పష్టంచేసింది. ఇండియా పోస్టు ద్వారా కూడా ఆర్బీఐ కార్యాలయానికి నోట్లు పంపవచ్చని తెలిపింది.
మే 19 నాటికి 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2 వేల నోట్లు చలామణిలో వున్నాయని ఆర్బీ ఐ తెలిపింది. అందులో 3.42 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకుల్లోకి చేరినట్టు ఆర్బీఐ వివరించింది. సెప్టెంబర్ 29 నాటికి కేవలం 0.14 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే చలామణిలో వున్నాయని తెలిపింది.