Telugu News » PM Tour : తెలంగాణకు ప్రధాని…మూడు రోజుల్లో రెండోసారి !

PM Tour : తెలంగాణకు ప్రధాని…మూడు రోజుల్లో రెండోసారి !

ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. ఇవాళ నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

by Prasanna
Modi

ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఇవాళ నిజామాబాద్ (Nizamabad) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రూ. 8  వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ (BJP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రధాని వాయుసేన హెలికాఫ్టర్‌లో నిజామాబాద్ వస్తారు.

Modi

ప్రధాని మోడీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. ఇవాళ నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

నిజామాబాద్ పర్యటనలో భాగంగా  అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతను ఉపయోగించి రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 1360 కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోడీ ప్రారంభిస్తారు. అలాగే ప్రతీ జిల్లాలో కొన్ని అభివృద్ధి పనులను మోడీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రూ. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య నిర్మించి రైలు మార్గాన్ని ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి, రూ.305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు.

నిజామాబాద్‌లో జరగబోయే సభ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్న నేపథ్యంలో జన సమీకరణపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎస్‌పీజీ అధికారులు సభ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. రాబోయే ఎన్నికలకు మోడీ సభ కీలకమవుతుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు.

You may also like

Leave a Comment