బీజేపీ (BJP) లో కుటుంబ పార్టీ నుంచి వచ్చినవారు ఎవరూ లేరా అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ప్రశ్నించారు. నిజామాబాద్ (Nizamabad) లో ప్రధాని మోడీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. విద్యావంతుడు, మంచి అడ్మినిస్ట్రేటివ్ అయిన కేటీఆర్ ఎదో ఒకరోజు తెలంగాణకు సీఎం అవుతారని చెప్పారు. అయినా, కేటీఆర్ సీఎం కావాలంటే.. మోడీ సహకారం అక్కర్లేదని, బీఆర్ఎస్ శాసనసభాపక్షం, కేసీఆర్ ఉంటే చాలన్నారు.
తెలంగాణపై మోడీ విషం కక్కుతున్నారని ఫైరయ్యారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్రే లేదన్న ఆయన.. ఆపార్టీ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీఇన్ని కావన్నారు. వారసత్వపు రాజకీయాలకు అంకురార్పణ చేసిందే బీజేపీ అని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ళల్లో అన్ని రంగాల్లో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు.
ప్రధాని హోదాలో ఉండి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ఆయన కుటుంబసభ్యులపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డారు సుఖేందర్ రెడ్డి. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధానికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. విభజన హామీలను తుంగలో తొక్కారని.. పార్లమెంటు లోపల, బయట తెలంగాణ రాష్ట్రాన్ని మోడీ హేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు.
అవినీతిపరులు తన పక్కన కూర్చోవడానికి భయపడతారని మోడీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు గుత్తా. ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బీజేపీ తమ పార్టీలో ఎందుకు చేర్చుకుంటోందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తాము అవినీతి చేస్తే.. ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పాటులో రక్తం ఎరులైపారిందని అంటున్న మోడీ.. ఎక్కడ జరిగిందో చూపించాలని డిమాండ్ చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.