కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్య పోస్టర్ వార్ (Poster War) నడుస్తోంది. మొదట ప్రధాని మోడీ (PM Modi) పెద్ద అబద్దాల కోరు (Big Lier) అంటూ పోస్టర్లను కాంగ్రెస్ షేర్ చేసింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని పది తలల రావణుడితో పోలుస్తూ బీజేపీ పోస్టర్లు వేసింది.
దీంతో కాంగ్రెస్ మరోసారి బీజేపీ వ్యతిరేక పోస్టర్లు వేసింది. దీంతో ఇప్పుడు పోస్టర్ వార్ తారా స్థితికి చేరుకుంది. వ్యాపారవేత్త అదానీ చేతిలో ప్రధాని మోడీ కీలు బొమ్మగా మారారంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజెమెత్తింది. ఈ మేరకు పోస్టర్లు షేర్ చేసింది. అందులో ప్రధాని మోడీ కాళ్లు చేతులను కాళ్లతో కట్టేసినట్టు ఉంది. ఆ తాళ్లతో ప్రధానిని అదానీ అనే అక్షరాలు ఆడిస్తున్నట్టు కనిపిస్తున్నాయి.
దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. విదేశీ శక్తుల చేతుల్లో కీలు బొమ్మ రాహుల్ గాంధీ అంటూ బీజేపీ పోస్టు పెట్టింది. అంతకు ముందు ప్రధాని మోడీ ఒక జుమ్లా బాయ్ అంటూ కాంగ్రెస్ పెట్టిన పోస్టుపై దుమారం రేగింది. పోస్టులో ప్రధాని మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పెట్టి ఈ చిత్రాన్ని బీజేపీ సమర్పిస్తోందంటూ ట్యాగ్ చేసింది.
వెంటనే స్పందించిన బీజేపీ రావణుడి అవతారంలో వున్న రాహుల్ గాంధీ ఫోటోను ట్వీట్ చేస్తూ దేశం ప్రమాదంలో వుందని వెల్లడించింది. కొత్త యుగం రావణుడు వచ్చాడంటూ బీజేపీ పోస్టులో పేర్కొంది. అతను అత్యంత దుర్మార్గుడంటూ మండిపడింది. అతను ఒక సనాతన ధర్మ వ్యతిరేకి అంటూ తీవ్రంగా మండిపడింది. భారత్‌ను నాశనం చేయడమే అతని అంతిమ లక్ష్యం అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.