వడ్డీ రేట్లపై ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు రెపో రేటు (Repo Rate )ను 6.75 శాతం గా కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా ఉండటం వరుసగా ఇది నాలుగవ సారి కావడం గమనార్హం. మరో వైపు ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్లను 6.75 శాతం వద్ద స్థిరంగానే ఉంచింది.
2023-24 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించారు. పరిణామం చెందుతున్న స్థూల ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని పలు అంచనాల తర్వాత రెపో రేటును 6.5 శాతం వద్ద అలాగే కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు.
2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.4 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. రెండవ త్రైమాసికంలో 6.4 శాతం మూడవ త్రైమాసికం వద్ద 5.6 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.2శాతంగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వృద్ధి అంచనాలు 6.5 శాతంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇక రెండు నెలల క్రితం ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (CPI)6.83 శాతానికి చేరినట్టు తెలిపారు.
ఇటీవల కూరగాయలతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో టర్మ్ ద్రవ్యోల్బణం మరింతగా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 29 నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయని చెప్పారు. దృఢమైన ఆర్థిక పరిస్థితులు, సుదీర్ఘమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న భౌగోళిక ఆర్థిక విచ్ఛిన్నత ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని దాస్ పేర్కొన్నారు.