సిక్కిం (Sikkim ) తీస్తా (Teestha) నది వరదల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా మరో 26 మృత దేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 53కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు జవాన్లు (Soldiers) కూడా ఉన్నట్టు తెలిపారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు.
వరదలకు మొత్తం 1173 ఇండ్లు ధ్వంసమైట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2,413 మందిని రక్షించామన్నారు. వరదల వల్ల తీస్తా వీ హైడ్రో పవర్ స్టేషన్ నీట మునిగినట్టు చెప్పారు. ఉత్తర సిక్కిం ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. వరదల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, పునరుద్దరణ పనుల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. చాంగ్ తాంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీ పనులను పుద్దరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కంటకి రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.
మరో వైపు రాబోయే ఐదు రోజుల పాటు మంగన్ జిల్లాలో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. లాచెన్, లాచూంగ్ ప్రాంతాల్లో చిక్కుకున్న 3000 మంది పర్యాటకులను ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారే అవకాశం ఉంది. గత రెండు మూడు రోజులుగా అనుకూలమైన వాతావరణం లేక పోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం సవాలుగా మారిందని భారత వాయు సేన తెలిపింది.