ఆర్కే రోజా (RK Roja).. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన తార. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక కూడా అప్పుడప్పుడు వెండితెరపై వెలిగిన ఈమె.. బుల్లితెరలో మాత్రం ఓ కామెడీ షో కంటిన్యూ చేశారు. అయితే.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. రెండింటికీ దూరమయ్యారు. పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. దేనికైనా రెడీ అంటూ ప్రతిపక్ష పార్టీలపై ఈమె విరుచుకుపడుతుంటారు. అలాగే, విపక్ష నేతల విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నారు. కానీ, ఈమధ్య టీడీపీ నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీని కూడా టచ్ చేశాయి. ఈ నేపథ్యంలో రోజాకు సీనియర్ హీరోయిన్ల మద్దతు పెరుగుతోంది.
బండారు వ్యాఖ్యలను తాజాగా నటి మీనా (meena) ఖండించారు. ఓ మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని చెప్పారు. తక్షణమే రోజాకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీన్ని అంత తేలిగ్గా వదలకూడదని.. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. రోజాపై వ్యాఖ్యలను ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండించారు. ముందుగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ లీడర్ ఖుష్బూ (Khushboo) స్పందించారు. రోజాకు పూర్తి మద్దతు తెలుపుతూ.. బండారు క్షమాపణ చెప్పే వరకు పోరాడుతానని వెల్లడించారు.
రాధిక (Radhika) స్పందిస్తూ.. బండారు క్షమాపణలు చెప్పకపోతే రహస్యంగా దొంగలా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో రోజాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి కలుగజేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. మీలా మేం తిరిగి మాట్లాడడానికి ఎంతో సమయం పట్టదని, మేం కూడా మీలాగే మాట్లాడాలని కోరుకుంటున్నారా? అంటూ ఫైరయ్యారు. అమరావతి ఎంపీ, ఒకప్పటి నటి నవనీత్ కౌర్ (Navneet Kaur) కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేసి.. ఇప్పుడు రాజకీయ రంగంలో ఓ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.. అందులోనూ ఓ మహిళను పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడేందుకు సిగ్గుందా విరుచుకుపడ్డారు.
ఇక మరో సీనియర్ నటి కవిత (Kavitha) స్పందిస్తూ.. మంత్రి రోజాకు బాసటగా నిలిచారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారని విమర్శించారు. అయితే.. ఇప్పటికే బండారుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.