బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh Khan) కు మహారాష్ట్ర సర్కార్ సెక్యూరిటీని పెంచింది. తాజాగా ఆయనకు వై ప్లస్ (Y Plus) కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల ఆయనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల గురించి వివరించేందుకు అధికార వర్గాలు నిరాకరించాయి.
షారుక్ ఖాన్ కు భద్రత కల్పించే విషయంలో రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్లకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం లేఖ రాసింది. షారుక్ ఖాన్ కు వై ప్లస్ భద్రత కల్పించాలని, ఎక్కడికి వెళ్లినా ఆయనకు ఎస్కార్ట్ పంపించాలని అన్ని కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలకు, ప్రత్యేక రక్షణ విభాగాలకు ఈ నెల 5న ఇంటెలిజెన్స్ విభాగం లేఖ పంపింది.
షారుక్ ఖాన్ కు ఇటీవల వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఉన్నత అధికారుల కమిటీ సమావేశం అయింది. ఆయన భద్రతపై ఆ సమావేశంలో సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వై ప్లస్ సెక్యూరిటీ కింద ఆయనకు 11 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. అందులో ఆరుగురు కమాండోలు, నలుగురు పోలీసులు, ఒక ట్రాఫిక్ క్లియరెన్స్ వెహికల్ ఉంటుందన్నారు.
ఉన్నతాధికారుల కమిటీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో వుంటాయని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల పఠాన్ సినిమాలోని భేషరమ్ రంగ్ పాటపై వివాదం రాజుకుంది. ఆ పాటలో దీపికా కాషాయ రంగు బికినీలో కనిపించింది. దీనిపై హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ కు ప్రాణహాని ఉందని పోలీసు వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.