భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Jai Shankar), కెనడా విదేశాంగ మంత్రి మెలని జోలి (Melanie Jolie) మధ్య రహస్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ కెనడా విదేశాంగ మంత్రితో జై శంకర్ సమావేశం అయ్యారని బ్రిటన్ కు చెందిన ఓ వార్తా పత్రిక (British Newspaper) కథనాలు ప్రచురించింది.
ఈ వార్తను ఇప్పటి వరకు అటు కెనడా కానీ ఇటు ఇండియా కానీ ధ్రువీకరించలేదు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలో కెనడా దౌత్య వేత్తలు భారత్ విడిచి వెళ్లి పోవాలని భారత్ డెడ్ లైన్ విధించినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో భారత్ తో నెలకొన్న దౌత్యపరమైన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు కెనడా ప్రయత్నాలు చేస్తోందని ఆ పత్రిక పేర్కొంది. భారత్‌తో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు తాము వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవల కెనడా విదేశాంగ మంత్రి తెలిపారు. తాము భారత్ తో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నామని పేర్కొన్నారు. కెనడా దౌత్య వేత్తల రక్షణ విషయంలో తాము సీరియస్ గా వున్నామని తెలిపారు.
ఈ విషయంలో భారత్ తో వ్యక్తిగతంగా చర్చిస్తామన్నారు. అంతకు ముందు కెనడా ప్రధాని ట్రూడో కూడా స్పందించారు. భారత్ తో దౌత్య పరమైన సమస్యలను మరింత తీవ్రతరం చేయాలని తమ దేశం కోరుకోవడం లేదని ఆయన వెల్లడించారు. అందుకే తాము భారత్ తో బాధ్యతాయుతంగా, నిర్మాణాత్మక చర్చలు జరుపుతామని తెలిపారు.