మీడియా సంస్థ న్యూస్ క్లిక్ (News Click) పై సీబీఐ ( CBI) దాడులు చేస్తోంది. తాజాగా న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురక్యస్త (Prabir Purkayastha) నివాసంతో పాటు కార్యాలయంలో సీబీఐ సోదాలు చేస్తోంది. విదేశీ సహకార ఉల్లంఘన చట్టం(FCRA)కింద నమోదైన కేసుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్టు సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
‘న్యూస్ క్లిక్’కు చైనాతో లింకులు ఉన్నాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఆ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు (Funds) వస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల (Delhi Police)తో పాటు పలు దర్యాప్తు సంస్థలు ఇప్పటికే దాడులు చేశాయి. తాజాగా సీబీఐ దాడులు చేయడం కలకలం రేపుతోంది.
గతవారం ఈ కేసులో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (UAPA)కింద ప్రబీర్, న్యూస్ క్లిక్ హెచ్ ఆర్ విభాగం చీఫ్ అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో పీపుల్స్ అలయన్స్ ఫర్ డెమోక్రసీ, సెక్యూలరిజమ్ టు సాబోటేజ్ అనే సంస్థలతో కలిసి ప్రబీర్ కుట్రలు పన్నారని ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఆ తర్వాత కుట్రలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు అవసరమైన విదేశీ నిధులను సమకూర్చేందుకు షావోవి, వీవో లాంటి పలు చైనా సంస్థలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇక మరో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. 2021 నుంచే న్యూస్ క్లిక్ పై ఈడీ నిఘా పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే ప్రబీర్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.