– రాష్ట్రానికి కేంద్ర నిధులు వస్తున్నా..
– బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది
– ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
– సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి పక్కా
– రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉంది
– దమ్ముంటే ఎంఐఎం 119 స్థానాల్లో పోటీ చేయాలి
– బండి సంజయ్ సవాల్
కేంద్రం నుంచి నిధులు వస్తున్నా.. బీజేపీపై బీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. గ్రామీణ సడక్ యోజన కింద వేస్తున్న రోడ్ల నిధులు, నేషనల్ హైవే రోడ్ల నిధులు, రైల్వే, రైతు వేదిక నిధులు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నించారు. రేషన్ బియ్యం పంపిణీ డబ్బులు, స్మశాన వాటికల నిర్మాణాలకు, గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్రం ఇవ్వడం లేదా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. స్మార్ట్ సిటీ, మున్సిపాలిటీలకు ఇస్తున్న నిధులు ఎవరివని అడిగారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల నగారా మోగించిందని.. రాష్ట్రంలో తమకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతు బంధు ఇచ్చి మిగితా సబ్సిడీలు ఆపేశారని.. యువతకు మాదకద్రవ్యాలు అలవాటు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కౌలు రైతులు ఏం పాపం చేశారని వారికి రైతు బంధు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీని తట్టుకోలేకే టీఆర్ఎస్ కాస్తా.. బీఆర్ఎస్ అయ్యిందన్నారు. టూరిస్ట్ మాదిరిగా కేసీఆర్.. దేశంలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని.. నిష్పక్షపాతంగా అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉందన్నారు బండి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ఆయన మంచిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి భార్య తిరుమలలో పూజలు చేశారని.. మంత్రి కేటీఆర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ కు ఓటమి తప్పదని.. కరీంనగర్ నుంచి తాను పోటీ చేస్తానని అధిష్టానానికి చెప్పానన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే పోటీ చేస్తానని చెప్పారు.
దమ్ముంటే ఎంఐఎం పార్టీ తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు సంజయ్. ఎంఐఎం హైదరాబాద్ ఓల్డ్ సిటీని న్యూసిటీగా ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. రజాకార్లు పాల్పడ్డ దారుణాల నేపథ్యంలో తెరకెక్కిన రజకార్ సినిమాపై అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరమని అన్నారు. మీరు నిజాం, రజాకార్ల వారసులా? ఎంఐఎం బాధపడుతుందని మీరెందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి 50 ఏళ్లకు మెచ్చూరిటీ వస్తే పెళ్లెప్పుడు? పిల్లలెప్పుడు? అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. వారెంటీ లేని పార్టీ గ్యారెంటీలు ఇస్తే ఎవరు నమ్ముతారని విమర్శించారు బండి సంజయ్.