టికెట్ కన్ఫామ్ అయ్యాక తొలిసారి జనగామ (Jangaon) నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeswar Reddy). ముందుగా సిద్దిపేట (Siddipet) జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం జనగామ జిల్లా కేంద్రంలో 16వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆశీర్వాద సభ సన్నాహక సమావేశానికి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు.
చేర్యాలలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. స్థానికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని చేపడుతున్న నిరాహార దీక్ష దగ్గరకు వచ్చి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. దీంతో పల్లాను చూసి ఆందోళనకారులు ఒక్కసారిగా ఆయనపైకి ఎగబడి.. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన వెనుదిరిగి వెళ్లారు. ఆందోళకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
జనగామ టికెట్ ను ముందు కేసీఆర్ పెండింగ్ లో పెట్టారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా మధ్య వార్ మొదలైంది. రాజేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముత్తిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పగించి సైలెంట్ చేసింది అధిష్టానం. అదీగాక, హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో పల్లాకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలోనే తొలిసారి నియోజకవర్గానికి వెళ్లారు ఆయన.
కొమురవెల్లి మల్లన్న ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మూడోసారి అధికారంలోకి రావాలని స్వామివారిని వేడుకున్నానని అన్నారు పల్లా. గత పది సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ది పనులు చేసుకున్నామని.. ఇంకోసారి ప్రజలు కేసీఆర్ ను ఆశీర్వదించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని.. మూడోసారి అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.