ప్రపంచ కప్ (World Cup)లో ఆప్ఘనిస్తాన్ (Afganisthan)తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ (India) ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), ఇషాన్ కిషన్ చెలరేగి ఆడారు. వారికి తోడు విరాట్ కోహ్లీ విరుచుకు పడటంతో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మరో 15 ఓవర్లు మిగిలి వుండగానే భారత్ విజయాన్ని అందుకోవడం విశేషం.
ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఆప్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఆఫ్ఘన్ జట్టుకు ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (21), ఇబ్రహీం జద్రాన్ (22) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రహ్మన్ షా తక్కువ పరుగులకే అవుటయ్యాడు. అనంతరం వచ్చిన అష్మతుల్లా షాహిదీ 88 బంతుల్లో 80 పరుగులు, అజ్మతుల్లా ఒమర్ జాయ్ 69 బంతుల్లో 62 పరుగులతో చెలరేగి ఆడారు. దీంతో 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేయగలిగింది.
ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ భూమ్రా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టి ఆప్ఘనిస్తాన్ నడ్డి విరిచాడు. హార్దిక్ పాండ్య 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్ చెరో ఒక్కో వికెట్ తీసి రాణించారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఎక్కడా తడ బడలేదు. ముఖ్యంగా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అప్ఘన్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 84 బంతుల్లో 131 పరుగులు చేశాడు.
ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 476 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 55 పరుగులతో విరుచుకు పడ్డాడు. కోహ్లీకి శ్రేయస్ 23 బంతుల్లో 25 పరుగులు చక్కని సహకారం అందించాడు. దీంతో 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసి భారత్ విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.