భారత్ (India) ఐదు వేల ఏండ్లుగా సెక్యులర్ దేశంగా (Secular Country) ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రజలంతా ఐక్యంగా ఉండి మంచి మానవ ప్రవర్తన అత్యుత్తమ ఉదాహరణంగా దేశాన్ని నిలపాలని ఆయన కోరారు. ప్రజలంతా తమ మాతృభూమి పట్ల భక్తి, ప్రేమ, అంకిత భావాలను కలిగి వుండాలని ఆయన సూచించారు.
మనం మాతృభూమిని జాతీయ సమైక్యతకు ముఖ్యమైన అంశంగా పరిగణిస్తామని చెప్పారు. పృథ్వి సూక్త అనే పుస్తక ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… మన ఐదు వేల ఏండ్ల ప్రాచీన సెక్యులర్ సంస్కృతి అని అన్నారు. ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని తెలిపారు. ఇది భారతీయుల భావన అన్నారు. ఇది ఒక సిద్ధాంతం కాదన్నారు.
ఇది ప్రస్తుతం వాస్తవ రూపం దాల్చిందన్నారు. దానికి అనుగుణంగా అంతా మసులుకోవాలని సూచించారు. దేశంలో చాలా భిన్నత్వం ఉందన్నారు. అందువల్ల ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దన్నారు. వసుధైక కుటుంబం అనే భావాన్ని ప్రపంచానికి బోధించగల శక్తి వంతమైన దేశంగా భారత్ ను నిలిపేలా చేయండని పిలుపునిచ్చారు. లోక కళ్యాణం కోసమే రుషులు భారత్ ను సృష్టించారని పేర్కొన్నారు.
వారంతా సన్యాసులు మాత్రమే కాదన్నారు. వారంతా తమ కుటుంబాలతో కలిసి సంచార జీవితాన్ని గడిపారన్నారు. ఆ సంచార జాతులు ఇప్పటికీ ఉన్నారని తెలిపారు. వాళ్లను గతంలో బ్రిటీష్ వాళ్లు క్రిమినల్ తెగలుగా ప్రకటించారన్నారు. ఇప్పటి వారంతా సమాజంలో తమ సంస్కృతిని ప్రదర్శిస్తూ వున్నారన్నారు. మన ప్రజలు జ్ఞానాన్ని తీసుకుని ప్రపంచ మంతటా వెళ్లారన్నారు.