కాంగ్రెస్ (Congress) పై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himantha Biswa Sharma) తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇజ్రాయెల్ (Israel)-హమాస్ (Hamas) మిలిటెంట్ల యుద్ధం విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ను పాకిస్తాన్తో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ కేవలం పాలస్తీనా ప్రజల హక్కుల గురించి మాత్రమే మాట్లాడటంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. హమాస్ మిలిటెంట్ల దాడిని కాంగ్రెస్ ఖండించాల్సిందని పేర్కొన్నారు. జోరాహట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. కాంగ్రెస్ కేవలం పాలస్తీనా గురించి మాత్రమే మాట్లాడిందని చెప్పారు.
ఉగ్రవాదం, హమాస్ మిలిటెంట్ల చేతుల్లో బందీలైన వాళ్ల గురించి కాంగ్రెస్ మాట్లాడలేదన్నారు. ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఖండించాల్సిందన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇండియాలో ఏర్పాటు చేయాలనుకుంటోందా లేదా పాకిస్తాన్ లోనా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.
యుద్ధంలో పాలస్తీనా ప్రజల హక్కుల కోసం తాము మద్దతు ఇస్తున్నట్టు సీడబ్ల్యూసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతకు ముందు సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ సర్కార్ రాక ముందు భారత విదేశాంగ విధానం మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఎలా బందీగా మారిందో చెప్పేందుకు ఇజ్రాయెల్ యుద్ధంలో కాంగ్రెస్ నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ అని అన్నారు.