– ప్రత్యేక రాష్ట్ర కష్టం అందరిదీ
– కేసీఆర్ ఒక్కరి వల్ల రాష్ట్రం రాలేదు
– బీఆర్ఎస్ పాలన అవినీతిమయం
– కల్వకుంట్ల అవినీతి ఢిల్లీకి చేరింది
– జమ్మికుంట సభలో రాజ్ నాథ్
తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ (KCR) ఒక్కరే ఉద్యమించలేదన్నారు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh). యావత్ తెలంగాణ సమాజం పోరాటం చేసిందని గుర్తు చేశారు. సోమవారం జమ్మికుంటలో బీజేపీ (BJP) జనగర్జన సభ జరిగింది. ఇందులో పాల్గొని ప్రసంగించారు రాజ్ నాథ్. బీఆర్ఎస్ (BRS) పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్నగడ్డ తెలంగాణ అని చెప్పారు.
1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని.. ఆ రెండింటిలో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారని గుర్తు చేశారు రాజ్ నాథ్. గుజరాత్ (Gujarat) లో రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉందని.. అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. ప్రధాని మోడీ (PM Modi) నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని వివరించారు. కానీ, తెలంగాణలో మాత్రం అభివృద్ధి శూన్యమని విమర్శలు చేశారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందన్నారు రాజ్ నాథ్. ఇదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారయిందని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని.. కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోందన్న ఆయన.. తెలంగాణలో అన్నీ ఉన్నా కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు.
జమ్మికుంటలో బీజేపీ చైతన్యం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు రాజ్ నాథ్. ఇటు కాంగ్రెస్ పైనా విమర్శల దాడి చేశారు. అప్పట్లో కాంగ్రెస్ తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిందని అన్నారు. ఆపార్టీ వైఫల్యంతో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు నెలకొన్నాయని చెప్పారు. బీజేపీ హయాంలో విభజించబడిన 3 రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని తెలిపారు రాజ్ నాథ్.