తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మెయిత్రా (Mahua Moitra) పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishi Kanth Dhoobey) చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు ఓ వ్యాపార వేత్త నుంచి ఎంపీ మహువా మోయిత్రా డబ్బులు తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. తాజాగా ఈ విషయంలో మరోసారి ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
లోక్ సభ వెబ్ సైట్‌లో మహువా మోయిత్రా లాగిన్ వివరాలను వ్యాపార వేత్త హీరానందానీ, ఆయన నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూపునకు ఆమె వివరాలు అందించారని ఆయన ఆరోపించారు. ఈ వివరాలను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు.
ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కు ఆయన లేఖ రాశారు. ఆ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. ఆ ఆరోపణలు వాస్తవమని తేలితే ఇది అత్యంత తీవ్రమైన నేరం అవుతుందని ఆయన అన్నారు. ఇది ఖచ్చితంగా దేశ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందన్నారు.
లోక్ సభ వెబ్ సైట్‌లో మహువా మెయిత్రా లాగిన్ కు సంబంధించి ఐపీ అడ్రస్‌లను చెక్ చేయాలని కోరారు. ఆ లాగిన్ ను ఆమె కాకుండా ఇతరులెవరైనా దాన్ని యాక్సెస్ చేశారా అన్న విషయాన్ని గుర్తించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణించాలని, వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు.
అంతకు ముందు వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోడీ టార్గెట్ చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. దీంతోపాటు ఐఫోన్ వంటి ఖరీదైన బహుమతులు తీసుకున్నారని ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపించారు.