యూపీ సర్కార్ (UP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళి పండుగకు ఉజ్వల పథం లబ్ధిదారులకు గిఫ్ట్ (Gift) ఇవ్వనున్నట్టు తెలిపింది. దీపావళి కానుకగా లబ్ధిదారులకు ఉచిత వంట గ్యాస్ ఇవ్వనున్నట్టు సీఎం యోగీ ఆదిత్య నాథ్ (Cm Yogi Adityanath) ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన డబ్బులను లబ్దిదారుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ దిపావళి కానుక కింద రాష్ట్రంలోని 1.75 కోట్ల కుటుంబాలు లబ్ది పొందనున్నట్టు అధికారులు వెల్లడించారు. బులంద్ షహర్‌లో సీఎం యోగీ ఆదిత్య నాథ్ రూ. 632 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకు స్థాపనలను చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో 55 లక్షల మంది మహిళల సొంతింటి కల నెరవేరిందన్నారు.
వారి కలను సాకారం చేసిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజనా పథకానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ కింద రాష్ట్రంలో 2.75 లక్షల టాయ్ లెట్ల నిర్మాణాలు జరిగాయని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేండ్ల ప్రధాని మోడీ నాయకత్వంలో నూతన భారత దేశాన్ని చూస్తూ వున్నామని సీఎం అన్నారు.
ఈ నూతన భారత్ అత్యంత శక్తివంతమైన, స్వయం సంవృద్ధి గల, అభివృద్ది చెందుతున్న దేశమని తెలిపారు. ఈ నూతన భారత్‌లో యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు లబ్ది పొందుతున్నారని చెప్పారు. ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన పారుల్ చౌదరి, అన్ను రాణిలను డీఎస్పీలుగా నియమించనున్నట్టు తెలిపారు.