కాంగ్రెస్ (Congress) పై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himantha Biswa Sarma) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్లో హమాస్ దాడులను కాంగ్రెస్ ఖండించలేదన్నారు. అంతే కాకుండా పాలస్తీనాకు కాంగ్రెస్ మద్దతు పలికిందని తెలిపారు. ఇదంతా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చేసిందని ఆయన ఆరోపించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియా నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లూజివ్ అలయెన్స్ (INDIA) సభ్యుల మధ్య ఐక్యత లేదని తెలిపారు. కేవలం దేశ ప్రజలను మోసం చేసేందుకే ఇండియా కూటమిని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు.
ఆ సమావేశంలో ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల గురించి తీవ్ర చర్చ జరిగిందన్నారు. ఆ సమయంలో హమాస్ దాడులను ఖండించాల్సిన అవసరం ఉందని ఆ సమావేశంలో అంతా అన్నారని చెప్పారు. కానీ తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నందున మనం పాలస్తీనాకు మద్దతు పలకాలని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు.
ఉగ్రవాదంపై అందరూ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాద బాధిత దేశంగా భారత్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ తన ఉదాసీన రాజకీయాల వల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ లాంటి అత్యంత పురాతనమైన పార్టీ హమాస్ దాడులను ఖండించి వుండాల్సందన్నారు.