కాంగ్రెస్ (Congress) పై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ (Himantha Biswa Sarma) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీజేపికి కాంగ్రెస్ లౌకిక వాదం గురించి నేర్పాల్సిన పని లేదని ఆయన మండిపడ్డారు. హిందువులను చంపడమే లౌకిక వాదమా? అని ప్రశ్నించారు. తమకు సెక్యులరిజం అనే భాషను నేర్పకండంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.
ఛత్తీస్ గఢ్‌లోని కవార్దలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ఛత్తీస్ గఢ్‌లో ఇటీవల లవ్ జిహాద్, మతమార్పిడి ఘటనలు బాగా పెరిగి పోతున్నాయని పేర్కొన్నారు. లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను లౌకిక వాదం పేరిట సమర్థించలేమని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ ఘటనలు తదుపరి స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో క్రైస్తవ మతంలోకి మారేలా గిరిజనులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఒక వేళ దానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే అప్పుడు భూపేశ్ బాఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని ఆరోపించారు. హిందువులను చంపడమే లౌకికవాదమా..? అని ప్రశ్నించారు. ముమ్మాటికి భారత్ హిందువులదేనని స్పష్టం చేశారు., ఇది ఖచ్చితంగా హిందువులకే చెందుతుందని చెప్పారు.
అయోధ్యలో రామాలయాన్ని కూల్చి వేసి దానిపై బాబర్ మసీదు కట్టడం సెక్యులరిజం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. మతమార్పిడులను సెక్యులరిజం అనరని స్పష్టం చేశారు. మాత కౌసల్య భూమిని మొఘల్ చక్రవర్తి అక్బర్ కు అప్పగించడం లౌకిక వాదం కానే కాదన్నారు. మన సెక్యులరిజం అనే భావనను బాబా సాహెబ్ అంబేద్కర్, హిందూ సంస్కృతి అందించాయన్నారు. సెక్యులరిజం అంటే లవ్ జిహాద్ కాదన్నారు.