భారత్ (India) లోని తమ పౌరులకు కెనడా (Canada) ప్రభుత్వం తాజాగా మరోసారి ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత్లో కెనడా వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇండియాలోని కెనడా పౌరులకు బెదిరింపులు లేదా వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని ట్రూడో సర్కార్ హెచ్చరించింది.
బెంగళూరు, చండీగఢ్, ముంబైలోని కెనడా కాన్సులేట్ జనరల్లు వ్యక్తిగత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అడ్వైజరీలో పేర్కొంది. పౌరులు తదుపరి కాన్స్యులర్ సమాచారం, సహాయం కోసం న్యూ ఢిల్లీలోని కెనడా హై కమిషన్ ను సంప్రదించాలని కోరింది. ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో అపరిచతులతో మాట్లాడటం లాంటివి చేయకూడదని సూచించింది.
కెనడా పౌరులు తమ వ్యక్తిగత వివరాలను ఎవరితో పంచుకోకూడదని సూచించింది. జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరించ వద్దని తెలిపింది. ఒంటరిగా ప్రయాణాలు చేయద్దని హెచ్చరించింది. ఎప్పటి కప్పుడు పౌరులు తమ ప్రయాణ వివరాలను తమ బంధువులు లేదా స్నేహితులకు తెలియజేస్తూ ఉండాలని ట్రావెల్ అడ్వైజరీ చేసింది.
భారత్లో తమ దేశానికి చెందిన 41 మంది దౌత్య వేత్తలను కెనడా రీకాల్ చేసింది. దౌత్య వేత్తలందరూ కెనడాకు చేరుకుంటున్నట్టు కెనడా పేర్కొంది. దౌత్యవేత్తల ఉపసంహరణకు భారత్ విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కెనడా పేర్కొంది. దీనిపై కెనడా ప్రభుత్వం ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోదని ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలి వెల్లడించారు.