Telugu News » Namo Barath : ‘నమో భారత్’ రైలు మహిళా సాధికారతకు ప్రతీక……!

Namo Barath : ‘నమో భారత్’ రైలు మహిళా సాధికారతకు ప్రతీక……!

ఇది దేశానికి చారిత్రాత్మక సమయం అని ప్రధాని మోడీ వెల్లడించారు. దేశంలో తొలి ర్యాపిడ్ రైల్ సర్వీసును జాతికి అంకితం ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

by Ramu
pm modi flags off namo bharat train at one section of rrts corridor

దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు ‘నమో భారత్’ (Namo Barath)ను ప్రధాని మోడీ (PM Modi)  ఈ రోజు ప్రారంభించారు. ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ (RRTS)లో ఈ రైలు పరుగులు పెట్టింది. ఇది దేశానికి చారిత్రాత్మక సమయం అని ప్రధాని మోడీ వెల్లడించారు. దేశంలో తొలి ర్యాపిడ్ రైల్ సర్వీసును జాతికి అంకితం ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

pm modi flags off namo bharat train at one section of rrts corridor

నాలుగేండ్ల క్రితం ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ రీజినల్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని చెప్పారు. ఇప్పుడు సాహిబా బాద్ నుంచి దుహాయ్ డిపో వరకు నమో భారత్ రైలును ప్రారంభించుకున్నామని పేర్కొన్నారు. తాము దేనికైతే శంకు స్థాపన చేస్తామో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను గతంలో చెప్పానని, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నానన్నారు.

నమో భారత్ రైలు అనేది దేశంలో మహిళ సాధికారతకు చిహ్నమని తెలిపారు. ఈ నూతన రైలులో డ్రైవర్ నుంచి సిబ్బంది వరకు అంతా మహిళలేనని వివరించారు. ఇది దేశంలో పెరుగుతున్న మహిళా సాధికారతకు చిహ్నమని వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ తన చిన్న నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను చిన్న తనంలో రైల్వే ప్లాట్ ఫారమ్ పై గడిపానన్నారు.

ఇప్పుడు ఈ ఆధునిక రైలులో ప్రయాణించే అవకాశం తనకు లభించిందన్నారు. రైల్వేల నూతన రూపాన్ని చూసి తన మనసు సంతోషంతో నిండిపోయిందన్నారు. ఈ అనుభవం చాలా సంతోషాన్ని ఇస్తోందన్నారు. నవరాత్రుల్లో శుభకార్యాలు చేసే సంప్రదాయం మనకు ఉందన్నారు. భారత దేశపు మొట్టమొదటి నమో భారత్ రైలుకు ఈరోజు మా కాత్యాయనీ ఆశీస్సులు అందాయన్నారు.

‘నమో భారత్’ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ ఆ రైలులో ప్రయాణించారు. ప్రయాణంలో భాగంగా విద్యార్థులు, ర్యాపిడ్ ఎక్స్ రైలు సిబ్బందితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ రైలు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులు పాల్గొన్నారు.

 

You may also like

Leave a Comment