కాంగ్రెస్ (Congress) పై సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akilesh Yadav) మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీట్ల విషయంలో కాంగ్రెస్‌తో ఒప్పందం కుదరక పోవడంతో ఆ పార్టీపై ఆయన విమర్శల దాడిని పెంచారు. తమకు సీట్లు ఇవ్వకూడదని కాంగ్రెస్ అనుకుంటే ముందే ఆ విషయాన్ని చెప్పి ఉండాల్సిందన్నారు. ఇప్పుడు ఎస్పీ కేవలం తనకు పట్టు ఉన్న స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందన్నారు.
ఇప్పుడు మధ్య ప్రదేశ్ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నికల్లో ఇండియా కూటమి పోటీ చేయాల్సి ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్ ఇలానే ప్రవర్తిస్తే ఆ పార్టీతో కలిసి ఎవరు పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మనమంతా ఇలానే అయోమయంతో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే విజయాన్ని సాధించలేమని ఆయన తేల్చి చెప్పారు.
ఇండియా కూటమిలో తాము ఉన్నప్పటికీ ఎస్పీ ఎప్పుడూ పీడీఏ(వెనుకబడిన, దళిత, అల్పా సంఖ్యాక వర్గాల) స్ట్రాటజీతో ముందుకు సాగుతుందన్నారు. మొదట పీడీఏ ఏర్పడిందన్నారు. ఆ తర్వాతే ఇండియా కూటమి ఏర్పాటైందని ఆయన తెలిపారు. అందుకే తాము పీడీఏ వ్యూహాన్నే అనుసరిస్తామని తాను గతంలో కూడా చాలా సార్లు చెప్పానని గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఇండియా కూటమి నుంచి ఎస్పీ వైదొలుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలిగించేలా సమాజ్ వాది పార్టీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను షాజహాన్ పూర్ వెళ్లానన్నారు. అక్కడ ఎక్కడ చూసినా రోడ్లపై చెత్తే కనిపిస్తోందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో మౌలిక సౌకర్యాలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు.