చంద్రశేఖర ఆజాద్….ధైర్యానికి పెట్టింది పేరు. మొండి తనం ఆయన మారు పేరు. అందుకే తన పేరు అడిగితే ఆజాద్ అన్నాడు. బ్రిటీష్ వాళ్లకు సింహస్వప్నం. విప్లవ వీరులకు మార్గదర్శి. పోరాటమే ఆయన ఊపిరి. అందుకే చివరి వరకు పోరాటమే చేశాడు. లొంగి పోవడం కన్నా చచ్చి పోవడం మిన్నా అని భావించి తుపాకీతో కాల్చుకుని మరణించాడు.
ఆజాద్ జననం 1906 జూలై 23. తల్లి దండ్రులు సీతారామ్ తివారి, జగరానీ దేవీ. 1919 జలియన్ వాలా బాగ్ ఘటనతో పోరుబాట పట్టాడు. నూనూగు మీసాల వయస్సులో సహాయ నిరాకరణలో పాల్గొన్నాడు. బ్రిటీష్ అధికారిపై దాడి చేసి కోర్టు బోను ఎక్కాడు. పేరు అడిగితే ఆజాద్ అంటూ తలెత్తి సమాధానం ఇచ్చాడు.
తన ఇల్లు జైలు అని, అక్కడికి వెళ్లేందుకు తనకు ఏం భయం లేదని చెప్పకనే చెప్పాడు. కొరడా దెబ్బలు తిని కరుడు గట్టిన పోరాట యోధునిగా మారాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి విప్లవ వీరులకు మార్గదర్శిగా మారాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆంగ్లేయులపై దాడులు చేస్తూ వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
1931, ఫిబ్రవరి 27న తన సహచరులను కలిసేందుకు అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్కుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటీష్ పోలీసులు ఆ పార్క్ ను చుట్టు ముట్టారు. లొంగి పోవాలంటూ ఆజాద్ కు హెచ్చరికలు చేశారు. కానీ ఆ హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు సాగాడు. పోలీసులపై తుపాకితో దూకి ముగ్గురుని హత మార్చాడు. ఇక తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని మరణించాడు.