ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భాఘేల్ (Bhupesh Baghel ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశం దొరికితే తనపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం (Union Governament) రెడీగా ఉందని అన్నారు. తనను అరెస్టు చేసేందుకు కేంద్రానికి ఎలాంటి అవకాశం దొరకడం లేదన్నారు. లేదంటే కేంద్రం తనను వదిలి పెట్టేదా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ తన అధికారాలను, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు కానీ పథకాలు గానీ లేవని చెప్పారు. అందుకే వీలైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు.
ఇప్పుడు బీజేపీకి పోరాడే సామర్థ్యం లేదన్నారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు పోరాడేందుకు రాష్ట్రంలో బీజేపీకి అవకాశం లేదన్నారు. అందుకే ప్రభుత్వం పరువును తీసే పనిలో పడ్డారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నవంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ధాన్యం సేకరణ డ్రైవ్ ను ప్రభావితం చేసేందుకే రైస్ మిల్లర్లపై కేంద్ర ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ చర్య అన్నారు. అధికారం కోసం బీజేపీ చాలా దిగ జారిపోయిందన్నారు. చివరికి రైతులకు కలిగే ఆర్థిక నష్టం గురించి కూడా బీజేపీ ఆలోచించడం లేదన్నారు.