ఇంజనీరింగ్ కళాశాలలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో జై శ్రీ రాం (Jai Shri Ram) అని నినాదాలు చేసిన విద్యార్థిని ఆ కళాశాల ప్రొఫెసర్ మందలించారు. స్టేజీ మీద నుంచి దిగి వెళ్లి పోవాలని ఆదేశించారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్ ఏబీఈస్ (ABES) ఇంజనీరింగ్ కళశాలలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలోని వివరాల ప్రకారం…..
ఘజియాబాద్‌లోని ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ‘నవ తరంగ్ 2023-24’పేరిట స్టూడెంట్ ఇండక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజి మీద ఉన్న విద్యార్థి ఒకరు జై శ్రీరాం అంటూ మిగతా విద్యార్థులను పలకరించారు. దీంతో మిగతా విద్యార్థులంతా తిరిగి జై శ్రీరాం అని అన్నారు. ఈ విషయాన్ని గమనించిన ఆ కళాశాల ప్రొఫెసర్ మమతా గౌతమ్ తీవ్ర ఆగ్రహంతో ఊగి పోయారు.
వెంటనే జై శ్రీ రాం అని నినాదాలు ఎందుకు ఇచ్చావని ఆ విద్యార్థిని తీవ్రంగా మందలించారు. ఇలాంటి పనులు చేసేందుకే నువ్వు కళాశాలకు వస్తున్నావా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కళాశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమమని అన్నారు. ఇలాంటి వాటిని కళాశాలలో అనుమతించబోమని తెలిపారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ ఆ విద్యార్థిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంతలో అక్కడి విద్యార్థులు ఆమెకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. మొదట తామే జై శ్రీరాం అని నినాదాలు చేశామన్నారు. దానికి ఆ విద్యార్థి బదులుగా జై శ్రీరాం అన్నాడని పేర్కొన్నారు. కానీ ఆ ప్రొఫెసర్ వినిపించుకోలేదు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇతర విద్యార్థులు జై శ్రీరాం అని పలక రించడంతోనే ప్రతిగా ఆ విద్యార్థి కూడా అలానే పలకరించారని అంటున్నారు. అసలు విషయం తెలుసుకోకుండా విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.