కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పై ఆ దేశ ప్రతిపక్షనేత, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే (Pierre Poilievre ) తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్‌తో దౌత్య విధానాల్లో ట్రూడో అనుసరిస్తున్న విధాలను ఆయన తప్పుబట్టారు. కెనడా ప్రధాని ఆయన విధానాలతో భారత్‌లో నవ్వుల పాలయ్యారని ఆయన మండిపడ్డారు.
నమస్తే రేడియో టొరంటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అన్ని దేశాలతో ట్రూడో విభేదాలు పెంచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఇటీవల కెనడాకు చెందిన దౌత్య వేత్తలను రీకాల్ చేయడంపై స్పందిస్తూ… ట్రూడో అత్యంత అసమర్థుడు అంటు ఫైర్ అయ్యారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ట్రూడో నవ్వుల పాలయ్యారని అన్నారు. భారత ప్రభుత్వంతో కెనడాకు “ప్రొఫెషనల్” సంబంధం అవసరమని వెల్లడించారు. తాను ప్రధానమంత్రి అయితే భారత్ తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తి అని అన్నారు.
అలాంటి దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండటం అవసరమన్నారు. కెనడాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పియరీ తెలిపారు. హిందూ నాయకులకు ఎదురవుతున్న బెదిరింపులు, బహిరంగ ప్రదేశాల్లో భారత దౌత్యవేత్తలపై దాడులు ఆమోద యోగ్యం కాదన్నారు. వాటిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.