అధికార వైసీపీ (YCP) ఓటమే లక్ష్యంగా టీడీపీ (TDP), జనసేన (Janasena) అడుగులు వేస్తున్నాయి. ఓవైపు జగన్ (Jagan) కు మరో ఛాన్స్ వద్దు అంటూ జనంలోకి వెళ్తూ.. ఇంకోవైపు తమ పొత్తును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ (TDP Janasena Alliance) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) పాల్గొన్నారు. అలాగే, ఇరు పార్టీల జేఏసీ సభ్యులు హాజరయ్యారు.
ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై మాట్లాడుకున్నారు. ఉమ్మడిగా జిల్లా, పార్లమెంట్, అసెంబ్లీ, మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై చర్చించుకున్నారు. పొత్తులో ఎక్కడైనా ఇబ్బందులున్నా పరిష్కరించేలా కమిటీలకు బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఇంచార్జీలు సమన్వయంతో, సర్దుబాట్లతో పనిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. జగన్ సర్కారుపై ఒత్తిడి పెంచడమే ఎజెండాగా విడివిడిగా, ఉమ్మడిగా ఉద్యమాలు, రైతు సమస్యలు, కరవుపై ప్రధానంగా ఫోకస్.. ఓట్ల తొలగింపుపై కలిసికట్టుగా పోరాటం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించామని చెప్పారు. ఇప్పటికే టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోతో పాటు.. జనసేన చెప్పే అంశాలను కూడా చేరుస్తామన్నారు. రెండు పార్టీలు కలిసి క్షేత్ర స్థాయిలో పని చేసే అంశంపై చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మళ్లీ రాజమండ్రిలో ఇలాంటి మీటింగ్ పెడతామని అన్నారు. తాజా సమావేశం హిస్టారికల్ అని చెప్పారు. హత్యలు చేసిన వాళ్లకూ బెయిల్ వచ్చేస్తోంది కానీ.. చంద్రబాబుకు టెక్నికల్ అంశాన్ని బేస్ చేసుకుని రాకుండా చేశారని ఆరోపించారు. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ పొత్తు చరిత్రాత్మకమన్నారు పవన్.
ఇక, లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని తెలిపారు. తమ మధ్య గొడవలు రావు.. మేం కొట్టుకోమన్నారు. వైసీపీ వాళ్లు కొట్టుకుంటారేమోనని సెటైర్లు వేశారు. జనసేన ఎన్డీఏ పార్టనర్ అని.. ఏపీ ప్రయోజనాలే ఆపార్టీకి ప్రయార్టీ అని తెలిపారు. అభివృద్ధి-సంక్షేమం తమ కూటమికి జోడెద్దుల బండి అని అన్నారు. అప్పులతో సంక్షేమం కాదు.. అభివృద్ధితో సంక్షేమం తమ నినాదమని తెలిపారు. కరవు.. జగన్ కవల పిల్లలు అని.. ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆరోపించారు లోకేష్.