బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ(BRS) మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పాయి.
అయితే, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్(BrS MP) పోటీ చేస్తుండగా.. అక్కడి నుంచే నేరేళ్ల (NERELLA) బాధితల పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా కోల హరీశ్ (KOLA HARISH) పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో బీఆర్ఎస్కు తప్పకుండా మైనస్ అవుతుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ హయాంలో తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వాలు మారిన న్యాయం జరగడం లేదన్నారు. పార్లమెంట్ వేదికగా తమ గొంతును వినిపించడానికి ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నాడు. 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా తమకు న్యాయం జరగకపోగా.. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులకు మాత్రం ప్రమోషన్లు వచ్చాయని కోల హరీశ్ వాపోయాడు.
తాము పెట్టిన కేసులపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. గతంలో అన్ని పార్టీలు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయని.. కానీ ఇప్పటివరకు అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జనంలోకి వెళ్తున్నామని.. అందుకే పార్లమెంట్ బరిలో నిలుస్తున్నట్లు కోల హరీశ్ స్పష్టంచేశారు.
కాగా, 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని నేరెళ్లలో 8 మంది దళితులపై అప్పటి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. నేరేళ్లలో ఇసుక దందాను అడ్డుకున్న గిరిజనులు లారీలను తగులబెట్టగా.. ఆ కేసులో వీరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా.. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా హైలెట్ అయ్యింది.