రాష్ట్రంలోని రహదారులు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక మూలన సగటున ఐదుకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కొన్నిఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరికొన్ని ఘటనా స్థలానికే పరిమితం అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ వైపు నుంచి పోలీసు అకాడమీ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి అదుపుతప్పి ఢీవైడర్‌ను (Car Hit devider) ఢీకొట్టింది.
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శంషాబాద్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, మృతులు, క్షతగాత్రులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ రోడ్డు ప్రమాదం ఘటనతో ఔటర్ రింగురోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతదేహాలన పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, మితిమీరిన వేగం, మద్యం మత్తులో కారు నడపడమే ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.