ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Cm Kejiriwal)ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో భారీ కుదుపు సంభవించిందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేజ్రీవాల్ అరెస్టుతో ఎవరికి లాభం .. ఎవరికి నష్టం అనే విషయాన్ని కాసేపు పక్కనబెడితే అవినీతి(Curruption) చేసిన వారి గుండెల్లో ఈడీ పేరు చెబితే రైళ్లు పరిగెడుతున్నాయని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఎలా ఈడీ దాడులు చేస్తుందో అని దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన పేరు మోసిన, బడా లీడర్లు హడలిపోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన వారం వ్యవధిలోనే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అంతకుముందు తన అరెస్టును నిలుపుదల చేయాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం ఈడీ విచారణ ప్రారంభమైనందున ఇపుడు అలాంటి తీర్పు ఇవ్వలేమని ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
అలా తీర్పు వెలువడిన సాయంకాలానికే 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ముందుగానే సీఎం ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి నివాసానికి వచ్చే అన్ని దారులను మూసివేయించారు. కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆయనతో పాటు ఇంట్లోని వారి ఫోన్లను సీజ్ చేశారు. అంతకుముందే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి అరెస్టుకు సంబంధించి సమాచారం కూడా ఈడీ అందించినట్లు తెలిసింది.
కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున సీఎం నివాసానికి చేరుకుని ఈడీకి, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇదంతా జరుగుతుండగానే అధికారులు కేజ్రీవాల్‌ను ఈడీ ప్రధానకార్యాలయానికి తరలించారు.నేడు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, కేజ్రీవాల్ కు సపోర్టుగా దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీల నేతలు నిలుస్తున్నారు. కేంద్రం అణచివేత ధోరణిని అవలంభిస్తోందని, మాట్లాడే నోర్లను నొక్కుతోందని పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ఇదంతా ఒకవైపు అయితే కేజ్రీవాల్ అరెస్టుతో దేశమొత్తం ప్రస్తుతం ఆయన గురించి మాట్లాడుకుంటోంది. అయితే, రెండ్రోజుల క్రితం వరకు బీజేపీకి ఎలక్ట్రరోల్ బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున సమకూరిన నిధుల గురించి చర్చ జరిగింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎలక్టోరోల్ బాండ్లతో డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ముందే భావించిన కేంద్రంలోని బీజేపీ.. కేజ్రీవాల్ అరెస్టుతో టాపిక్ డైవర్ట్ చేసిందని మరికొంత మంది నేతలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు.