దొంగతనం క్షమించరాని నేరమే అందులో ఎటువంటి డౌటు లేదు. అయితే వాళ్లలో కూడా అప్పుడప్పుడు ఓ సామాజిక పరిశీలకుడు నిద్రలేస్తాడని,చేస్తున్న పనిపట్ల బాధ్యతగా వ్యవహరిస్తే..చోరుడు సైతం శభాష్ అంటాడని రీసెంట్ గా జరిగిన ఓ దొంగతనం రుజువు చేసింది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో ఒక దొంగతనం చోటుచేసుకుంది. సాధారణంగా దొంగలు డబ్బు,బంగారాన్ని దోచుకుంటారు. దొరక్కపోతే శ్రమ వృధా అయినందుకు అసహనం వ్యక్తం చేస్తారు.
అయితే ఇక్కడ మాత్రం ఓ దొంగ తను దొంగలించడానికి వచ్చిన బ్యాంక్‌పై ప్రశంసలు కురిపిస్తూ కాగితంపై రాసి వెళ్లాడు.మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameen Bank)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఓ గుర్తు తెలియని దొంగ దోపిడీకి యత్నించాడు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. లాకర్ గదిలోకి చొరబడటానికి అవకాశం దక్కకపోవడంతో చోరీ జరగలేదు.
బ్యాంకులో దొంగతనానికి వచ్చిన దొంగకు.. బ్యాంకు మొత్తం వెతికినా ఏమీ దొరకలేదు. దీంతో బ్యాంకులో ఎలాంటి నగదు చోరీ కాలేదు. డబ్బులు లేకపోవడంతో నిరాశకు గురైన ఆ దొంగ.. అక్కడే ఉన్న ఓ మార్కర్ తీసుకుని పేపర్‌పై ఓ ‘గమనిక’ రాశాడు
ఎంతో కష్టపడి, ఎన్నో ప్లాన్లు వేసుకుని బ్యాంకు దొంగతనానికి వస్తే.. రూపాయి కూడా దొరకకపోవడంతో ‘గుడ్ బ్యాంకు(Good bank)..ఒక్క రూపాయి కూడా దొరకలేదు..నన్ను పట్టుకోవద్దు.. నా వేలి ముద్రలు కూడా ఉండవు’ అని కాగితంపై రాసి పెట్టి వెళ్లిపోయాడు.
శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన బ్యాంకు ఉద్యోగులు ఆ దొంగ రాసిన నోట్ చదివి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు స్థానిక పోలీసులతో పంచుకున్నారు.
అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనను గుర్తించకుండా దొంగ జాగ్రత్త పడినప్పటికీ.. బ్యాంకు సీసీ కెమెరా(CC camera)లో దొంగతనానికి అతను ప్రయత్నించిన ఫుటేజీ మాత్రం రికార్డైంది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రజలు ఎవరైనా ఊర్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. నగదు, డబ్బును వెంట తీసుకొని వెళ్లాలని చెప్పారు.ఈ ఘటన తర్వాత బ్యాంకు భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏదేమైనా దొంగ రాసిన నోట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.