ఈమధ్య వరంగల్ (Warangal) లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అచ్చం అలాంటి ఘటనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో జరిగింది. పాల్వంచ మండలం రాజాపురం గ్రామానికి చెందిన గౌతమ్ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా తన భూమి ఆక్రమణకు గురి అయిందని సంబంధించిన కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశాడు. అయినా, ఎవరూ పట్టించుకోవడం లేదని టవర్ ఎక్కి నిరసనకు దిగాడు.
107 సర్వే నెంబర్ లో తనకు రెండెకరాల 20 గుంటల భూమి ఉందని.. దీన్ని ఇతరులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని అంటున్నాడు గౌతమ్. సర్వే చేసి అధికారులు సర్వే రిపోర్ట్ ఇచ్చినా కూడా.. తన భూమి తనకు దక్కలేదని ఈ విషయంపై 2019 మే 29వ తేదీన కొత్తగూడెంలో వాటర్ ట్యాంక్ పెట్టిన నేపథ్యంలో నాటి అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ అది అమలు కాలేదన్నాడు.
గత ఏడు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం జరిగే వరకూ దిగేది లేదని చెప్పాడు గౌతమ్. నాకు ఏదైనా జరిగితే సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలని తెలిపాడు. తన వాంగ్మూలంతో వీడియోలను స్థానిక వాట్సాప్ గ్రూపులకు పంపించాడు.
ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేశాడు గౌతమ్. అప్పటిదాకా సెల్ టవర్ దిగనని.. లేకపోతే దూకేస్తానని హెచ్చరించాడు.