అబాదీ భానో బేగం (Abadi Bano Begum) … భారత స్వతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ముస్లిం మహిళ. ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించిన అలీ సోదరుల (Ali Borthers)ల మాతృమూర్తి. బురఖా ధరించి రాజకీయ సమావేశంలో ప్రసంగించిన తొలి మహిళ ఆమె. స్వతంత్ర్య ఉద్యమంలో మహిళల మద్దతు కోసం మహాత్మ గాంధీ ఆమె సహాయాన్ని కోరారంటే ఆమె నాయకత్వం గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు.
1850లో యూపీలో అబాదీ భానో బేగం జన్మించారు. రాంపూర్ సంస్థానంలోని సీనియర్ అధికారిగా ఉన్న అబ్దుల్ అలీఖాన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఆరుగురు సంతానం. ఆమె కుమారుల్లో మౌలానా షౌకత్ అలీ, మౌలానా మహమ్మద్ అలీ జవహర్‌లు చరిత్రలో అలీ సోదరులుగా ప్రసిద్ది చెందారు. అలీ సోదరులిద్దరూ కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
చిన్నతనంలోనే భర్తను కోల్పోయినప్పటికీ కష్టపడి పని చేసి తన పిల్లలకు మంచి విద్యను అందించారు. 1917లో బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న అలీ బ్రదర్స్ ను విడుదల చేయాలని కోరుతూ ఆమె నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అబాదీ భానో బేగంతో గాంధీ సమావేశమై స్వాతంత్య్ర ఉద్యమానికి మహిళల మద్దతును కోరేందుకు ఆమె సహాయాన్ని కోరారు. ఆ సమయంలో ఆమెను తన తల్లి అని సంబోధించాడు.
కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ సమావేశాల సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… అన్ని మతాలకు చెందిన భారతీయులు ఐక్యంగా ఉంటేనే సంపూర్ణ స్వాతంత్ర్యం లభిస్తుందన్నారు.. అనేక సమావేశాలలో, ఆమె తన దేశంలోని కుక్కలు మరియు పిల్లులు కూడా బ్రిటిష్ వారి బానిసత్వంలో ఉండకూడదనేది తన ఆశయమని బహిరంగంగా ప్రకటించేవారు.
1924లో ఆమె మరణించారు. ఆమె మరణించిన అరవై ఆరు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ ఆమె గౌరవార్థం స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 28 సెప్టెంబర్ 2012న న్యూ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా ఇన్‌స్టిట్యూట్‌లో అబాదీ బానో బేగం జ్ఞాపకార్థం ఒక బాలిక హాస్టల్‌కు ఆమె పేరు పెట్టారు.