తెలంగాణ హైకోర్టు (Telangana High Court) నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిల భారతీయ విద్యార్థి సంఘం (ABVP) వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 55పై తాజాగా ఆందోళనకు దిగింది. రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఎదుట ధర్నాకు దిగింది.
విశ్వవిద్యాలయానికి సంబంధించిన 100 ఎకరా స్థలాన్ని హైకోర్టుకు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేసింది. జీవో 55ను వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను మరో చోటుకు మార్చాలని లేక పోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్శిటీకి చెందిన ఒక్క గజం భూమిని కూడా హైకోర్టుకు ఇవ్వడానికి వీలు లేదన్నారు.
వర్శిటీ స్థలాన్ని హైకోర్టుకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు వర్శిటీ వద్దకు చేరుకున్నారు. ఏబీవీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హైకోర్టు నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి మీ నిరసన తెలపండని సూచించారు. కానీ దానికి ఏబీవీపీ నేతలు నిరాకరించారు. పరిపాలన భవనం ఎదుట తమ నిరసనను కొనసాగిస్తామని చెప్పారు.
తాము అక్కడి నుంచి వెళ్లబోమంటూ బీష్మించుకు కూర్చున్నారు. జీవో 55ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ భూములను అమ్ము కుంటున్నరంటూ ఆరోపణలు గుప్పించారు. గతంలో వీసీగా పని చేసిన అధికారి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఇటీవల హైకోర్టు భవనానికి 100 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో ఈ భూమిని కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది.