ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ వర్సిటీ (JNU)లో భారత వ్యతిరేక నినాదాలు (Anti Bharath Slogans) కలకలం రేపాయి. జేఎన్ యూ వర్శిటీ గోడలపై తాజాగా భారత వ్యతిరేక నినాదాలు కనిపించాయి. దీనిపై పలు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై జేఎన్‌యూ అడ్మిస్ట్రేషన్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఫిర్యాదు చేసింది.
జేఎన్‌యూ వర్శిటీలో భారత వ్యతిరేక నినాదాలను విద్యార్థి సంఘంగా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. వర్శిటీలోని భాషా భవనం గోడలపై ‘భారత ఆక్రమిత కశ్మీర్’,ఫ్రీ కశ్మీర్, భగవా జలేగా నినాదాలు దర్శనమిచ్చాయని తెలిపింది. దీన్ని పలువురు విద్యార్థులు ఫోటోలు తీశారని చెప్పింది. ఈ ఘటన అధికారుల దృష్టికి వెళ్లగా గోడలపై పెయింట్ వేసి ఆ రాతలను చెరిపి వేశారని వివరించింది.
ఈ ఘటనలను అడ్డుకోవడంలో సెక్యూరిటీ విభాగం విఫలమైందని జేఎన్‌యూ వర్శిటీ ఏబీవీపీ సెక్రటరీ వికాస్ పటేల్ అన్నారు. దీనికి చీఫ్ సెక్యూరిటీ అధికారి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు జేఎన్ యూ వర్శిటీ అధికారులు స్పందించలేదు. ఆ రాతలు ఎవరు రాశారనే విషయాన్ని తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు.
మొదటి ఆదివారం ఉదయం వర్శిటీ గోడలపై భారత వ్యతిరేక రాతలను కొందరు విద్యార్థులు గుర్తించారు. వాటిన బ్లూ కలర్, రెడ్ కలర్ పెయింట్స్ తో రాసినట్టు తెలిపారు. దీంతో పాటు కొన్ని చోట్ల నేలపై కూడా ఈ నినాదాలను రాశారు. వీటిని గమనించిన కొందరు విద్యార్థులు పలువురికి షేర్ చేశారు. ఆ తర్వాత అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.