ఢిల్లీ వర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీబీపీ (ABVP) ఘన విజయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) స్పందించారు. ఈ విజయం జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే యువత భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఢిల్లీ వర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు వెలుపడిన నేపథ్యంలో అమిత్ షా నిన్న ట్వీట్ చేశారు.
వర్శిటీ ఎన్నికల్లో అద్భుతమై విజయాన్ని సాధించిన ఏబీవీపీ నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించేందుకు మండలి కార్యకర్తలు దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తారని తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. నేటి యువతలో జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించేలా కృషి చేస్తారని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ జెండా ఎగిరింది. మొత్తం నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడు కీలకమైన పోస్టులను ఏబీవీపీ గెలుచుకుంది. ఢిల్లీ వర్శిటీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ నేత తుషార్ దేదా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఎన్ఎస్ యూఐ అభ్యర్థి హితేశ్ గులియాపై ఆయన గెలిచారు.
ఇక స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా ఏబీవీపీ అభ్యర్థి అపరాజిత, స్టూడెంట్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా సచిన్ బైంస్లాను విద్యార్థులు ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 24 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. కానీ ప్రధాన పోటీ మాత్రం ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీల మధ్య నెలకొంది. మొత్తం 52 కాలేజీల్లో, పలు డిపార్ట్ మెంట్లలో ఈ ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించారు