మార్కెట్లో ఏం కొందామన్నా ఆలోచించి కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల్లో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తుండడంతో ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా కల్తీపాల తయారీపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కల్తీపాల(Adulterated Milk) గుట్టురట్టయింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri Dist)లో చోటుచేసుకుంది.
కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్వోటీ పోలీసులు(SOT Police) ఆదివారం భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల, గౌసుకొండ గ్రామాల్లో దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 350 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలోనూ పోలీసులు దాడిచేసి కల్తీ పాల తయారీదారులను అరెస్టు చేసిన ఘటనలు అనేకం. అయినప్పటికీ వీళ్లు తమ తీరు మార్చుకోవడం లేదు. జిల్లాలోని భువనగిరి, బొమ్మలరామారం, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి మండలాలు హైదరాబాద్‌కు అతి చేరువలో ఉండటంతో వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. కల్తీ పాలను హైదరాబాద్‌లోని స్వీట్‌హౌజ్‌లు, హోటళ్లు, గృహ సముదాయాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగడం వల్ల ప్రాణాంతక క్యాన్సర్, కాలేయం, మెదడు సంబంధిత వ్యాధులతో పాటు ఇతర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలతో పాటు పెద్ద వారూ అనారోగ్యానికి గురవుతారని చెబుతున్నారు. వీటిలో కలిపే యూరియా, కెమికల్స్, వంటనూనె వల్ల వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.