మానవుడు అభివృద్ధి పథంలో ఎంత వేగంగా ప్రయాణిస్తోన్న ప్రకృతి వైపరీత్యాల (Natural disasters) విషయంలో మాత్రం వెనకే ఉన్నాడు. ఊహించని విపత్తులు ప్రకృతి నుండి ఎదురైతే, ఎదుర్కోలేని స్థితిలో మనిషి జీవనం కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ప్రపంచంలో పలుచోట్ల సంభావిస్తున్న ఘటనలు చెప్పుకోవచ్చు..
ఇటీవల వరుస భూకంపాలతో (Earthquake) అఫ్ఘానిస్థాన్ (Afghanistan) దద్ధరిల్లుతోంది. ఇప్పటి వరకు జరిగిన ప్రకృతి విధ్వంసం విషయంలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.1 గా.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతు ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు సంభవించిన భూకంప ప్రాంతాల్లో భారీ భవనాలు కుప్పకూలడంతో వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
నాలుగు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో 4 వేల మృతదేహాలను వెలికితీశారు. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతున్నది. మళ్లీ కొన్ని గంటల వ్యవధిలో భూకంపం సంభవించడం ఆఫ్ఘానిస్థాన్‌ను ఆందోళనకు గురిచేస్తున్నది. కాగా అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు.