అయోధ్య (Ayodhya) రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ‘రాష్ట్ర’ (Raashtra) రోజూ ఓ ఆసక్తికర కథనాన్ని అందిస్తోంది. ఇప్పటిదాకా సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు వరకు ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు ఆ తర్వత జరిగిన పరిణామాలు, రామ మందిర నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసుకుందాం.
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అందరి దృష్టి రామ మందిరం నిర్మాణంపై పడింది. మందిరం పనులు ఎప్పుడు ఎలా చేపడతారు.. ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్నవిషయాలపై దేశ వ్యాప్తంగా అనేక చర్చలు జరిగాయి. క్రమక్రమంగా అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా సాధువులు, భక్తులతో కోలాహలంగా మారింది. అప్పటిదాకా ఆలయ నిర్మాణంపై స్థానికుల్లో కొంత సందిగ్ధత నెలకొన్నా సుప్రీం తీర్పు సంతోషాన్ని కలిగించింది. పవిత్ర సరయూ నది తీరంలో ఉన్న రాముడి జన్మస్థలం అయోధ్య పట్టణానికి భక్తులు తరలిరావడం మొదలుపెట్టారు.
రామజన్మభూమిలో మందిర నిర్మాణం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు వచ్చిన మరుసటి నెలలోనే 15 మంది సభ్యులతో కూడిన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణం జరిగింది. ముందు 13 మంది సభ్యులను ఎన్నుకోగా.. వారు మరో ఇద్దరు సభ్యులను (ఒకరు అయోధ్యకు చెందిన శ్రీ నృత్యగోపాల్ దాస్, మరొకరు విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులైన చంపత్ రాయ్) ఎన్నుకున్నారు. ప్రజల నుండి నిధులు సేకరించడం ద్వారా రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి సమ్మతిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తమ వంతుగా ఒక రూపాయిని ఇచ్చి పని ప్రారంభించాల్సిందిగా ట్రస్ట్ ను కోరింది. అప్పటికే రామజన్మభూమి న్యాస్ పేరుతో భూమి, గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మందిరం కోసం ఇచ్చిన భూమిని కలుపుకొని, 8 కోట్ల కుటుంబాల నుండి, కుటుంబానికి ఒక రూపాయి 25 పైసల చొప్పున దేశం నలుమూలలనున్న ప్రజల నుండి సేకరించిన ధనంతో చెక్కబడిన శిల్పాలు, 2 లక్షల 80 వేలకు పైగా గ్రామాల నుండి సేకరించిన రామ శిలలను, తయారీకయిన ఖర్చు పోగా మిగిలిన ధనాన్ని మొత్తం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అప్పగించారు.
కోట్ల మంది హిందూవుల కలను నిజం చేస్తూ.. 2020 ఆగస్టు 5న భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమిపూజ జరిపి రామజన్మభూమిలో బాల రాముడు (రామ్ లల్లా) కు భవ్య మందిరాన్ని కట్టడం ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో మోడీ పాల్గొన్నారు. భూమి పూజలో భాగంగా.. రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పండితులు సూచించినట్లుగా ఆరోజు మధ్యాహ్నం 12.44 గంటలకి మొదలై.. 12.45 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ రామయ్య పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమిపూజ జరిగింది. అదే సమయంలో పునాది రాయి వేశారు ప్రధాని మోడీ. 40 కేజీల వెండి ఇటుకను పునాది రాయిగా వేశారు. దాంతో రామాలయ నిర్మాణం ప్రారంభమైనట్లైంది.
కొద్ది రోజుల్లో హిందూవుల కల నెరవేరబోతోంది. 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. తర్వాతి కథనంలో కొత్తగా నిర్మాణం జరుపుకున్న రామ మందిర విశేషాల గురించి అందిస్తుంది ‘రాష్ట్ర’.