భారత విదేశాంగ మంత్రి (External Affairs Minister) ఎస్. జైశంకర్ (S.Jai Shankar) యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోని బ్లింకన్ (Antony Blinken)తో ఈ రోజు సమావేశం కానున్నారు. దీంతో పాటు పలువురు అమెరికా ప్రతినిధులతో ఆయన భేటీ కానున్నారు. ఇటీవల కెనడాతో దౌత్య సంబంధాల ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అంటోని బ్లింకన్ తో జైశంకర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరువురి నేతల మధ్య సమావేశ ఎజెండా గురించి ఇప్పటి వరకు ఇరు దేశాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కెనడాతో దౌత్య ప్రతిష్టంభన గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గత వారం యూఎన్ సాధారణ సభ సెషన్ లో భాగంగా యూఎస్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తో జైశంకర్ సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో వారితో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్ని వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి యోకో కమికవాలు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో కెనడా దౌత్య వివాదం గురించి ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. విదేశాంగ మంత్రులు సమావేశంలో కెనడా దౌత్య వివాదం గురించి ఎలాంటి చర్చ జరగలేదని మాథ్యూ మిల్లర్ వెల్లడించారు.
అది ద్వైపాక్షిక సమావేశం కాదని అందుకే కెనడా గురించి ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము స్పష్టంగా వున్నామని చెప్పారు. దర్యాప్తు విషయంలో కెనడాకు సహకరించాలని భారత్ ను కోరామని వెల్లడించారు.