ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు (AICC Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. త్వరలో మరో రెండు గ్యారంటీలను సీఎం రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రజలకు హామీలను ఇచ్చి తప్పించుకునే రోజులు ఎప్పుడో పోయాయని అన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయలేదంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ ఇచ్చిన హమీలపై రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
మోదీ సర్కార్ కేవలం ప్రకటనలు మాత్రమే చేస్తోందని, పనులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని నిప్పులు చెరిగారు. ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అచ్చే దిన్ కాదు.. జనాలు నానా కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు.
సమస్యలు ఎదురైనప్పుడు ఏదో ఒక ఇష్యూ ముందుకు తీసుకు వచ్చి విషయాన్ని మోడీ డైవర్ట్ చేస్తుంటారని తీవ్రంగా విరుచుక పడ్డారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడంలో మోడీ దిట్ట అని విమర్శలు చేశారు. ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారని.. మరోసారి దేవున్ని వాడుకుంటారని విమర్శించారు. సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు రాహుల్ న్యాయ యాత్ర చేస్తున్నారని వివరించారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసే కుటిల రాజకీయాలను మోడీ, షా చేస్తుంటారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడరన్నారు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారని విమర్శించారు.
కాంగ్రెస్‌కు బూత్ లెవెల్ కార్యకర్తలే బలమన్నారు. రాహుల్‌తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల కృషితో పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. సమరోత్సహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.