తెలంగాణలో పదోతరగతి (Secondary School Leaving Certificate) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఈ పరీక్షల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించిన విషయం తెలిసిందే.
పదో తరగతిలో బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు, బాలుర కంటే 3.81 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు బషీర్ బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం మంగళవారం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు.
అయితే, ఈసారి పాస్ పర్సెంటేజీ గతేడాతితో పోలీస్తే భారీగా పెరిగింది. ఇకపోతే పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) జరగుతాయన్నారు. దీనికి సంబంధించిన టైం టేబుల్‌ను విద్యాశాఖ సెక్రెటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. కాగా, ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మే 16 వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని వెల్లడించారు. దీనికి తోడు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నేటి నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రీ కౌంటింగ్‌కు రూ.500, రీ వెరిఫికేషన్‌కు రూ.1000 రుసుమును నిర్ణయించారు.