17 రోజుల నిరీక్షణకు తెర పడింది. తాజాగా ఉత్తరాఖండ్ టన్నెల్‌లో (utharakhand tunnel) డ్రిల్లింగ్ (Drilling) ముగిసినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తరకాశిలోని సిల్క్యారా టన్నెల్ నుంచి 41 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికులను సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరామర్శించారు.
అంతకు ముందు నిన్న రాత్రి 52 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. మరో ఐదు మీటర్ల దూరంలో కార్మికులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆశలు పెరిగాయి. మరి కొద్ది గంటల్లో కార్మికులను బయటకు తీసుకు రానున్నట్టు అధికారులు ప్రకటించాయి. కానీ గత అనుభవాల దృష్ట్యా కార్మికుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చే వరకు తమకు మనశ్శాంతి ఉండదని తెలిపారు. మరోవైపు రెస్క్యూ అనంతరం కార్మికులను ఎయిమ్స్ కు తరలించాలని అధికారులు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత కార్మికులకు చికిత్స అందించేందుకు వైద్య నిపుణులను టన్నెల్ వద్దకు అధికారులు రప్పించారు.
టన్నెల్ డ్రిల్లింగ్ విజయవంతంగా పూర్తయి కార్మికులు సురక్షితంగా బయట పడాలని అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ పూజలు చేశారు. టన్నెల్ వద్ద చినూక్ హెలికాప్టర్ ను కూడా ఏర్పాటు చేశారు. రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరగానే కార్మికుల కుటుంబాలకు అధికారులు స్వీట్లు పంచి పెట్లారు.
అనంతరం డ్రిల్లింగ్ పూర్తయిన విషయం తెలియగానే సీఎం పుష్కర్ సింగ్ ధామీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఒక గొప్ప విజయం సాధించామని తెలిపారు. మరోవైపు 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. రాత్రి 8 గంటలకు కార్మికుల తరలింపు మొదలవుతుందన్నారు.
8 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడు బయటకు రాగానే వాళ్ల కుటుంబ సభ్యులో ఆనందం మొదలైంది. 8 గంటల 30 నిమిషాల వరకు 41 మంది కార్మికులను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకు వచ్చింది. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారిని గ్రీన్ కారిడార్ ద్వారా వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని అధికారులు వెల్లడించారు.