పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ (PM MODI) కాంగ్రెస్ పార్టీ(Congress party), మేనిఫెస్టో (Manifesto)పై చేస్తున్న ఆరోపణలను హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం(P. Chidambaram) తప్పుబట్టారు. అంతేకాకుండా ప్రధాని మోడీ తన స్థాయిని మరిచి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘వారసత్వ పన్ను’ అనే అంశం ఎక్కడా లేదని అన్నారు. బీజేపీ లీడర్లు, ప్రధాని మోడీ కావాలనే ఓటర్లను తప్పుడు ఆరోపణలతో మభ్యపెడుతున్నారని సీరియస్ అయ్యారు. పన్నులపై కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, నిస్పక్షపాత పన్ను పరిపాలనను అందిస్తామని చిదంబంరం అన్నారు.
మోడీ పాలనలో ప్రభుత్వం ద్వంద్వ ‘సెస్’ను అంతం చేసి, దుకాణదారులకు , రిటైల్ వ్యాపారాలకు గణనీయమైన పన్ను మినహాయింపులు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో పేర్కొనట్లు చెప్పారు.కానీ, ప్రధాని మోడీ మాత్రం ఊహాజనిత, కల్పిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అసలు అంశాలను ప్రజలను వివరించాలన్నారు. పదేళ్ల మోడీ పాలనలో వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్రమైన భంగం వాటిల్లుతోందన్నారు. ప్రజస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చిదంబరం వివరించారు. మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తారని.. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే పునరుద్ధరిస్తామన్నారు. కానీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ(CAA)ను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టంచేసిందని తెలిపారు.