కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ఒక రోజు ముందు సెప్టెంబర్ 17న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపినట్టు ఆయన వెల్లడించారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు గత నెల 31న కేంద్రం ప్రకటించింది. ఈ సమావేశాల అజెండా గురించి కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఫైర్ అయ్యారు.
ఈ సమావేశాల ఎజెండా గురించి కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలుసన్నారు. అయినప్పటికీ మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటామన్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
ఇది ఇలా వుంటే ఈ సమావేశాల్లో మొదటి సెషన్ పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత పార్లమెంట్ నూతన భనవంలోని మిగిలిన సెషన్స్ నడుస్తాయని పేర్కొన్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చే బిల్లును ఈ సమావేశాల్లో పార్లమెంట్ కు కేంద్రం తీసుకు వస్తుందని వెల్లడించాయి.