బిహార్ (Bihar) ప్రభుత్వం అఖిల పక్ష సమావేశానికి (All party meeting) పిలుపు నిచ్చింది. రాష్ట్రంలో నిన్న కుల గణన ఫలితాలను ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకు వచ్చింది. తాజాగా ఆ ఫలితాలపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ ఫలితాల నేపథ్యంలో అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించనుంది.
బిహార్ ప్రభుత్వం కుల గణన ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని 13.1 కోట్ల జనాభాలో 36 శాతం మంది ప్రజలు అత్యంత వెనుక బడిన కులాలకు చెందిన వారేనని ప్రభుత్వం వెల్లడించింది. 27.1 శాతం మంది వెనుక బడిన వర్గాలకు చెందిన వారని, 19.7 శాతం షెడ్యూల్ కులాలకు, 1.7 శాతం షెడ్యూల్ తెగలకు ఇతర వర్గాలకు చెందిన వారు 15.5 శాతం ఉన్నట్టు పేర్కొంది.
సర్వే ఫలితాలను రాష్ట్రంలోని అన్ని పార్టీలకు అందజేయనున్నట్టు సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు. దానిపై ఆయా పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కుల గణనను మండల్ కమిషన్ సిఫార్సుల పునరుద్ధరణగా భావించ వచ్చా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు.
ప్రస్తుతం అలాంటి వివరాల్లోకి వెళ్లడం తనకు సరైనది కాదని తెలిపారు. ప్రస్తుతానికి ఈ కుల గణన ఫలితాలను అన్ని పార్టీలకు షేర్ చేయనివ్వండన్నారు. ఆ తర్వాత ఎక్కువ సహాయం అవసరమని భావించే కులాలను లక్ష్యంగా చేసుకుని విది విధానాలను రూపొందించడంపై తమ దృష్టి ఉంటుందని పేర్కొన్నారు. బిహార్ లో కుల గణణ దేశ వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల జనాభా గణను మార్గదర్శనం చూపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.